: మ్యాగీ ప్రొడక్షన్ ప్రారంభం!... దేశవ్యాప్తంగా ఉత్పత్తిని ప్రారంభించిన నెస్లే
నూడుల్స్ అంటేనే మ్యాగీ. మ్యాగీతోనే నెస్లే పేరు మారుమోగిపోయింది. అయితే తనకు ఆయువుపట్టుగా ఉన్న మ్యాగీతోనే నెస్లే కష్టాల్లో చిక్కుకుంది. అప్పటిదాకా లాభాల్లో దూసుకుపోయిన ఆ సంస్థ నష్టాల ఊబిలోనూ కూరుకుపోయింది. చిన్న పిల్లలు అత్యంత ఇష్టంగా ఆరగించే మ్యాగీ నూడుల్స్ లో హానికర రసాయనాలున్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అన్ని ల్యాబులు మ్యాగీ నూడుల్స్ పరీక్షల్లో బిజీబిజీగా గడిపాయి. ఈ క్రమంలో దాదాపు దేశవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం అమలైంది. దాదాపు మూడు నెలల పాటు సాగిన పరీక్షల్లో ఎట్టకేలకు మ్యాగీ పాసైంది. ఇటీవలే మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెస్లే దేశవ్యాప్తంగా ఉన్న తన ప్లాంట్లలో చిన్న చిన్నగా మ్యాగీ ఉత్పత్తిని ప్రారంభించింది. కర్ణాటకలోని నంజన్ గడ్, పంజాబ్ లోని మోగ, గోవాలోని బిచోలిమ్, హిమాచల్ ప్రదేశ్ లోని తహ్లీవాల్, పంత్ నగర్ లలోని తన అన్ని ప్లాంట్లలో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు నెస్లే బాంబే స్టాక్ ఎక్సేంజీకి సమాచారం ఇచ్చింది.