: చంద్రబాబు కటౌట్ ఎక్కి, ఆత్మహత్య చేసుకుంటానంటున్న పవన్ అభిమాని... ఉద్రిక్తత
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. క్యాంపు కార్యాలయం ముందు ఉన్న 100 అడుగుల చంద్రబాబు కటౌట్ పైకి ఎక్కిన గోవిందరాజులు అనే రైతు... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతేకాదు, దీనికి సంబంధించి సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచాడు. వ్యవసాయంలో నష్టం, బాధిస్తున్న క్యాన్సర్ వ్యాధి, ఆర్థిక సమస్యలే తన ఆత్మహత్యా యత్నానికి కారణమని నోట్ రాసి ఉంచాడు. గోవిందరాజులు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అడ్డెకల్లు గ్రామస్తుడు. సూసైడ్ నోట్ లో గోవిందరాజులు రాసిన అంశాలు ఇవే. "నేను పవన్ కల్యాణ్ అభిమానిని. పవన్ చెప్పిన మాటలను విని టీడీపీ తరపున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి వార్డ్ మెంబర్ గా కూడా గెలిచా. వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో పాటు, క్యాన్సర్ వ్యాధి నన్ను బాధిస్తోంది. నాకు ఆర్థిక కష్టాలు పెరిగి పోయాయి. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా"... ఇదీ సైసైడ్ నోట్ లోని సారాంశం. ఈ క్రమంలో, సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట కొంచెం టెన్షన్ ఏర్పడింది. అయితే, గోవిందరాజులుతో మాట కలిపిన పోలీసులు... అతన్ని కిందకు దించడంలో సఫలమయ్యారు. వెంటనే అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని... మీడియాతో మాట్లాడనీయకుండా తీసుకెళ్లారు.