: కోర్టు లోపల చింటూ రాయల్...బయట కఠారి అనుచరులు: చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత

చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ లను హత్య చేసిన చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ కొద్దిసేపటి క్రితం చిత్తూరులోని జిల్లా కోర్టులో లొంగిపోయాడు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల కళ్లుగప్పి జిల్లా కోర్టు ప్రాంగణం చేరుకున్న చింటూ, నేరుగా న్యాయమూర్తి వద్దకెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. చింటూ లొంగుబాటుపై సమాచారం అందుకున్న కఠారి మోహన్ అనుచరులు ఆగ్రహంతో రగిలిపోయారు. వందలాదిగా జిల్లా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కఠారి మోహన్, అనురాధలను దారుణంగా హత్య చేసిన చింటూను కఠినంగా శిక్షించాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. చింటూను ఉరి తీయాలని కఠారి మోహన్ అనుచరవర్గంలోని కొందరు యువకులు ఆగ్రహంతో ఊగిపోయారు. క్షణాల్లో కోర్టు ప్రాంగణం ముందు వేలాదిగా కఠారి అనుచరులు చేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను అక్కడికి తరలించారు. మీడియా సమావేశంలో ఉన్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ అర్థాంతరంగా సమావేశం ముగించి కోర్టు వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ కఠారి అనుచరుల నినాదాలు హోరెత్తుతున్నాయి.