: వ్యూహాత్మక ఎత్తుగడల్లో చింటూ రాయల్ దిట్ట!.. రెండ్రోజుల క్రితం లేఖ, నేడు కోర్టులో లొంగుబాటు


చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ లను పొట్టనబెట్టుకున్న చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో పోలీసులకు షాకిచ్చాడు. ఈ నెల 17న సొంత మేనమామ మోహన్, ఆయన భార్య అనురాధను హత్య చేసిన చింటూ క్షణాల్లోనే అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. రెండు వారాల పాటు ఎక్కడున్నాడో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తనతో పాటు ఘటనలో పాల్గొన్న తన అనుచరులను లొంగిపోయేలా ఆదేశాలు జారీ చేసిన చింటూ, తాను మాత్రం పరారయ్యాడు. ఈ రెండు వారాల సమయంలో చింటూ ఏకంగా శ్రీలంకలో తలదాచుకున్నట్లు వార్తలు వినిపించాయి. రెండు రోజుల క్రితం పోలీసులను అయోమయంలోకి నెట్టేలా అతడు ఓ లేఖను మీడియాకు విడుదల చేశాడు. లొంగిపోవాలని తాను అనుకుంటున్నప్పటికీ, పోలీసు శాఖలో కొందరు తనను హతమార్చే అవకాశాలున్నట్లు అతడు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖతో పోలీసులు డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న చింటూ అనుచరులను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు సన్నాహాలు చేసుకున్నారు. ఈ విషయం చింటూకు చేరిపోయింది. ఓ పక్క జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చింటూ అనుచరులను మీడియా ముందు ప్రవేశపెట్టే పనిలో ఉన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఉండగా, సరిగ్గా అదే సమయంలో చింటూ నేరుగా జిల్లా కోర్టు లోపలికి వెళ్లిపోయాడు. నేరుగా న్యాయమూర్తి వద్దకు వెళ్లిన చింటూ లొంగిపోతున్నట్లు జడ్జీకి చెప్పాడు. కోర్టుకు వచ్చిన సందర్భంగా చింటూ ఒంటరిగానే ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కోర్టుకు వచ్చినప్పుడు పోలీసులు చింటూను చూసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. చింటూ అరెస్ట్ తప్పకపోయేది. ఆ తర్వాత రోజుల తరబడి పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకే చింటూ పోలీసులను పక్కదారి పట్టించి తాను మాత్రం కోర్టులో లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News