: ఫలించిన ఎనిమిది సంవత్సరాల చర్చలు... భారత్ కు ఆస్ట్రేలియా సహకారం
గత ఎనిమిదేళ్లుగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చర్చలు ఫలించాయి. భారత్ కు యురేనియం సరఫరా చేయడానికి ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య అణు సహకార ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి జూలి బిషప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత్ తో యురేనియం వ్యాపారం నిర్వహించుకోవడానికి ఆస్ట్రేలియన్ కంపెనీలకు వీలు కలుగుతుంది. వాస్తవానికి భారత్ కు యురేనియం సరఫరా చేయడానికి ఆస్ట్రేలియా సిద్ధంగానే ఉంది. కానీ, అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించడం, ఆస్ట్రేలియాలో ప్రభుత్వాలు మారడం వంటి అంశాలు ఈ ఒప్పందం కార్యరూపం దాల్చే అంశంలో ఆలస్యానికి కారణమయ్యాయి.