: ఒకటీ రెండు కాదు... 150 కొత్త విమానాలు కొనుగోలు చేయనున్న స్పైస్ జెట్
బోయింగ్, ఎయిర్ బస్ ల నుంచి 150 కొత్త విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ వెల్లడించారు. మార్చి 2016లోగా ఆర్డర్లు ఇస్తామని, ఏ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలన్నది ఇంకా తేల్చలేదని ఆయన తెలిపారు. కుప్పకూలిపోయే స్థితి నుంచి తేరుకుని లాభాల బాట పట్టిన స్పైస్ జెట్, ఇక భారీ స్థాయిలో విమానాలను చేకూర్చుకుని మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో స్పైస్ జెట్ లో మెజారిటీ వాటాలను మారన్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన అజయ్ సింగ్, గత మూడు త్రైమాసికాల్లో లాభాలను చూపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పైస్ జెట్ ఫ్లీట్ లో 41 విమానాలు ఉన్నాయి. కొత్తగా ఇచ్చే ఆర్డర్లలో అత్యధికం బోయింగ్ 737 లేదా ఎయిర్ బస్ ఏ320లు ఉంటాయని, రెండు కంపెనీలూ తమకు విమానాలు సరఫరా చేసేందుకు ఆసక్తితో ఉన్నాయని తెలిపారు. చిన్న నగరాల మధ్య సర్వీసుల కోసం ఇప్పటికే 14 బొంబార్డియర్ విమానాలు తిప్పుతున్న సంస్థ వీటి సంఖ్యనూ పెంచుకోవాలని చూస్తున్నట్టు సింగ్ వెల్లడించారు. చిన్న విమానాల కోసం ఫ్రాన్స్ కు చెందిన ఏటీఆర్ తో, బ్రెజిల్ కు చెందిన ఎంబ్రారర్ తో చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.