: అదృశ్యమైన ‘నాగార్జున’ విద్యార్థి ఆత్మహత్య... నాన్నే కారణమంటూ సూసైడ్ నోట్!
గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కళాశాలకే చెందిన వరంగల్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన ఇరు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోగా, తాజాగా వెలుగుచూసిన ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. తన తండ్రి కారణంగానే ఆత్మచేసుకుంటున్నానని కళాశాలకు చెందిన థర్డ్ ఇయర్ విద్యార్థి గణేశ్ సూసైడ్ నోట్ రాశాడు. ఈ నెల 25 నుంచి కనిపించకుండాపోయిన గణేశ్ నేటి ఉదయం వర్సిటీకి సమీపంలోని చినకాకాని వద్ద రైలు పట్టాలపై విగత జీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గణేశ్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. సదరు నోట్ లో గణేశ్ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాడు. తన కన్న తండ్రి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సదరు లేఖలో పేర్కొన్నాడు. తండ్రే తన ఆత్మహత్యకు కారణమని చెప్పిన గణేశ్ అసలు కారణాన్ని మాత్రం చెప్పలేదు. పోలీసుల సమాచారంతో అతడి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి బయలుదేరారు. ఈ ఘటనపై అతడి తండ్రి నోరు విప్పితేనే కాని అసలు కారణం వెల్లడయ్యేలా లేదు.