: రాజకీయాలు వదిలేసే ఆలోచనలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్
తాను త్వరలో రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. గోవా పరిధిలోని మపుసాలో లోకమాన్య మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. "60 ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ పదవీ విరమణ గురించి ఆలోచిస్తారు. నాకు డిసెంబరు 13తో 60 దాటుతాయి. ఈ విషయమై రెండు మూడేళ్ల క్రితమే ఆలోచన ప్రారంభించాను. ఇకపై పెద్ద బాధ్యతలను మోయాలని అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు. కాగా, 2012లో గోవాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్ పారికర్ ను, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ, తన క్యాబినెట్ లోకి ఆహ్వానించి, కీలకమైన మంత్రి పదవిని అప్పగించిన సంగతి తెలిసిందే.