: బుట్టాయగూడెంలో రెచ్చిపోయిన పోలీసులు...విద్యార్థులపై అకారణంగా దాడి, ఒకరికి తీవ్ర గాయాలు


పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం పోలీసులు రెచ్చిపోయారు. నిన్న రాత్రి నడిరోడ్డుపై విద్యార్థులను చితకబాదారు. పోలీసుల లాఠీ దెబ్బలతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకెళితే... నిన్న రాత్రి బుట్టాయగూడెం మండల పరిధిలోని ఓ బ్రిడ్జీపై సిట్టింగ్ వేసిన ఓ విద్యార్థుల గ్రూపు మద్యం సేవిస్తోందట. అటుగా వెళుతున్న పోలీసులు విద్యార్థులను చూసి తమ వాహనాన్ని నిలిపి విద్యార్థులపై లాఠీలు ఝుళిపించారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించిన అతడి మిత్ర బృందం పోలీసులు తమను అకారణంగా కొట్టారని ఆందోళనకు దిగారు. అంతేకాక దాడి సందర్భంగా ఓ విద్యార్థి మొత్తం ఘటనను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఈ దృశ్యాలను అతడు మీడియా చానెళ్లకు పంపించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు పలు తెలుగుల చానెళ్లలో ప్రసారమవుతున్నాయి. ఇదిలా ఉంటే, నడిరోడ్డుపై మద్యం సేవించడమే కాక పేకాట ఆడుతున్న విద్యార్థులను వారించామని, ఈ క్రమంలో తమపైకే దాడికి యత్నించిన విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లగొట్టామని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News