: నన్ను విడుదల చెయ్యండి! లేదా మెర్సీ కిల్లింగ్ కు అనుమతించండి!: ఓ జీవిత ఖైదీ ఆవేదన
‘నన్ను విడుదల చేస్తారా? లేక మెర్సీ కిల్లింగ్ కు అనుమతిస్తారా?’ అంటూ ఓ జీవిత ఖైదీ తన ఆవేదన వ్యక్తం చేశాడు. జీవిత ఖైదీల విడుదల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో జీవితంపై ఆ ఖైదీ విరక్తి చెందాడు. ఈ విషయమై జైలు అధికారులకు మొర పెట్టుకున్నాడు. రాష్ట్రపతి, గవర్నర్ కు లేఖలు కూడా రాశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన శ్రీకాంత్ అనే జీవిత ఖైదీ కడప జిల్లా కారాగారంలో కొంత కాలంగా శిక్ష అనుభవిస్తున్నాడు. కిడ్నాప్, హత్య కేసుల్లో శ్రీకాంత్ దోషి అని తేలడంతో 2001లో కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. అయితే, సత్ప్రవర్తన కల్గిన ఖైదీలను గణ తంత్ర దినోత్సవం రోజున విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీని కింద ఈ ఏడాది కూడా కొంత మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే, తన ప్రవర్తన సరిగ్గానే ఉన్నా తన విడుదలకు అధికారులు అవకాశమివ్వట్లేదని అతను ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు మెర్సీ కిల్లింగ్ కైనా అనుమతించాలని శ్రీకాంత్ కోరుతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘కడప జిల్లా సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్నాను. జీవిత ఖైదీల విడుదల కోసం జీవో.ఎం.ఎస్.నం 163 ద్వారా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా విడుదలకు నేను అనర్హుడిగా ఉండిపోయాను. అంతకుముందు జీవో.నం.220 లో కూడా ఈవిధంగా సెక్షన్ పెట్టి నన్ను నిలిపివేశారు. అందరూ రిలీజవుతూ ఉంటే... నేను కాలేకపోవడంతో బాధపడుతున్నాను. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా..జీవితాంతం ఖైదీగా నేనెందుకు బతకాలి? ఒక శిక్ష వేశారూ అంటే.. పరివర్తన కోసమే కదా? పరివర్తన వచ్చిన తర్వాత రిలీజ్ చెయ్యాలి. జనవరి 26 లోపున నన్ను విడుదలన్నా చెయ్యండి లేదా కారుణ్య మరణానికైనా అనుమతించండి’ అంటూ ఆ జీవిత ఖైదీ వాపోయాడు.