: పారిస్ సదస్సుకు బయలుదేరిన ప్రధాని మోదీ
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో రేపటి నుంచి జరగనున్న వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సు ప్రారంభం రోజున ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవుతారు. కాగా, పారిస్ లో ‘ఉగ్ర’ దాడుల అనంతరం అక్కడ తొలిసారి జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సు ఇదే కావడంతో ఫ్రాన్స్ దేశం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.