: నడిరోడ్డుపై రెచ్చిపోయిన రానా తమ్ముడు!
ప్రముఖ సినీ నటుడు రానా తమ్ముడు అభిరామ్ రెచ్చిపోయాడు. తమ కారును ఢీకొట్టుకుని వెళ్లిన వ్యక్తులను వెంబడించి మరీ, వారిపై దాడి చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి హైదరాబాదు, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సంఘటనపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, పోలీసులు చెప్పిన వివరాలు... జూబ్లిహిల్స్ చౌరస్తాలో బైక్ పై వచ్చిన ఇద్దరు విదేశీయులు అభిరామ్ వస్తున్న కారు ముందు భాగానికి కొంచెం తగిలించుకుంటూ వెళ్లారు. కారులో నుంచి కిందకు దిగిన అభిరామ్, బైక్ ఢీకొట్టిన భాగాన్ని చూసిన అనంతరం ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో, వాళ్లను పట్టుకునేందుకు పరుగు తీశాడు. వారిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటనలో ముందు దాడికి పాల్పడిందెవరనే విషయమై, వారి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం, మొదలైన విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.