: సాధించేది లేదు, సాధించగలిగింది కాదు: చంద్రబాబుపై రోజా విసుర్లు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊహకందని, అసాధ్యమైన వృద్ధి లక్ష్యాలను కలలో చూసుకుంటున్నారని, తెల్లారి వాటిని ప్రజలకు చెప్పి మభ్యపెడుతున్నారని వైకాపా నేత రోజా విమర్శించారు. ఈ ఉదయం పత్రికల్లో వచ్చిన '15 శాతం వృద్ధి లక్ష్యం' వార్తలను చూపుతూ, ఇంత జీడీపీ వృద్ధిని అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా సాధించడం లేదని, ఏపీ ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. ఈ లక్ష్యం సాధించగలిగింది కాదని అన్నారు. 15 శాతం జీడీపీ రేటు చైనాకు ఉందా? అని ప్రశ్నించిన రోజా, బాబు పర్యటించే మలేషియా, సింగపూర్ లకు కూడా అంత వృద్ధి లేదని గుర్తు చేశారు. ఓ ముఖ్యమంత్రిగా ఈ విషయాన్ని చెప్పారా? లేదా ఓ పోలిగాడిగా చెప్పారా? అన్నది చంద్రబాబే వెల్లడించాలని డిమాండ్ చేశారు. అసలు వృద్ధి రేటును ఎలా లెక్కిస్తారో కూడా తెలియకుండా ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సగం పొలాల్లో పంట నష్టపోయిన వేళ, విభజన తరువాత పరిశ్రమలు, ఐటీ హైదరాబాద్ లో నిలిచిన వేళ, డబుల్ డిజిట్ గ్రోత్ ఎలా సాధ్యమని అడిగారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇంతటి వృద్ధి నమోదు కాలేదని గుర్తు చేశారు. ఆయన్ను జైలుకు లేదా పిచ్చాసుపత్రికి పంపాల్సి వుందని, ఎక్కడికి పంపాలో ఆయనకే చాయిస్ ఇస్తున్నామని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో, విద్యార్థుల ఆత్మహత్యల్లో, మహిళలపై అత్యాచారాల్లో, చింతమనేని ప్రభాకర్ వంటి వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడంలో రికార్డులను నమోదు చేసుకున్నారని రోజా నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News