: ఇక ఈ-లోన్ల వంతు... డిజిటల్ వాలెట్ రుణాలొచ్చేస్తున్నాయ్!
అంతా ఎలక్ట్రానిక్ యుగంగా మారిన వేళ, ప్రజలు తీసుకునే రుణాలూ అదే రూపంలోకి మారిపోయే సమయం వచ్చేసింది. మొబైల్ వాలెట్ సేవలందిస్తున్న 'మోబీక్విక్' కస్టమర్లకు డిజిటల్ వాలెట్ లోన్లను ఆఫర్ చేయనుంది. ఇందుకోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)లతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. "భారత ఆర్థిక వ్యవస్థలో ఎంతో మంది రుణాలు తీసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్నంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో ఈ-లోన్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని వెల్లడిస్తాం" అని మోబీక్విక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిపిన్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే ఇండియాలో ఎన్నో కంపెనీలు మొబైల్ వాలెట్ సేవలందిస్తున్నాయి. తొలుత వీటిని రీచార్జ్ చేసుకోవడం ద్వారా కొంత డబ్బు చేర్చుకుని, వాటితో షాపింగ్ వంటివి చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆర్బీఐ బ్యాంకింగ్ అనుమతులు ఇస్తామని ప్రకటించిన తరువాత 41 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, అందులో మోబీక్విక్ కూడా ఉంది. అయితే, ఈ సంస్థకు ఆర్బీఐ అనుమతి లభించలేదు. దీంతో పోటీలో నిలిచి సత్తా చాటుకునేందుకు ఈ-లోన్ ఆలోచనకు సంస్థ వచ్చినట్టు తెలుస్తోంది.