: మళ్లీ వస్తున్న వర్షాలు... నేడు, రేపు!
దక్షిణ కోస్తాలో బీభత్సం సృష్టించిన వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వచ్చే 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశంలో 3.6 కిలోమీటర్ల ఎగువన ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, దీని ప్రభావంతో తమిళనాడులో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచివుండటం, మరోసారి వర్ష సూచనల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.