: అమెరికన్ వీధుల్లో తుపాకులు ఈజీగా దొరికేస్తున్నాయి...దీనిని అడ్డుకోవాలి!: ఒబామా
అమెరికన్ వీధుల్లో ఆయుధాలు సులువుగా దొరుకుతున్నాయని, ప్రజల్లో హింసా ప్రవృత్తి పెరగడానికి ఇదీ ఒక కారణమని దీన్ని అడ్డుకునేందుకు ఏదైనా చేయాలని బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. కొలరాడోలో జరిగిన కాల్పుల ఘటనపై ఆయన మాట్లాడుతూ, ఘటనలో ముగ్గురు మరణించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఆయుధాలతో ఉపయోగం లేనప్పటికీ, అవి సులువుగా లభిస్తుండటంతోనే ఈ తరహా చర్యలు చోటు చేసుకుంటున్నాయని ఓ ప్రకటనలో ఒబామా వివరించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, అతన్ని అధికారులు విచారిస్తున్నారని తెలిపారు. తుపాకులతో జరుపుతున్న హింసను అడ్డుకుని తీరుతామని, మిలటరీ తరహా ఆయుధాలపై మరింత నియంత్రణ విధించనున్నామని ఒబామా పేర్కొన్నారు. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని సౌత్ కరోలినాకు చెందిన 57 ఏళ్ల రాబర్ట్ లూయిస్ గా గుర్తించారు. ఎందుకోసం కాల్పులకు తెగబడ్డాడన్న విషయాన్ని అతనింకా వెల్లడించలేదని సమాచారం.