: చలో బెజవాడ... ఇక మలేషియా తరహా పాలన: చంద్రబాబు
వచ్చే సంవత్సరం జూన్ నుంచి అమరావతి, విజయవాడ ప్రాంతాలే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మలేషియా ప్రభుత్వం ఇస్తున్న విధంగా ప్రతి శాఖకూ పనితీరు విషయమై ర్యాంకింగ్స్ ఇస్తామని, ప్రతి మూడు నెలలకూ ఓసారి ర్యాంకుల సమీక్ష జరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ సచివాలయంలో మంత్రులతో సమావేశమైన ఆయన, జనవరిలో మలివిడత జన్మభూమి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అధికారులంతా తమతమ ఉద్యోగులతో సహా బెజవాడ కదిలేందుకు సిద్ధంగా ఉండాలని, ఏ క్షణం ఏ శాఖకు భవనం సమకూరుతుందో, ఆ క్షణమే అక్కడికి తరలాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని సాధించడం ద్వారా వృద్ధి రేటును ప్రభావితం చేసుకోవచ్చని, తదుపరి అర్థిక సంవత్సరంలో 15 శాతం రాష్ట్ర జీడీపీ నమోదు చేసేలా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సంవత్సరం పడిన భారీ వర్షాలు తదుపరి ఖరీఫ్ సీజన్ లో మంచి పంటలను, దిగుబడిని రైతులకు అందిస్తాయన్న నమ్మకం తనకుందని తెలిపారు.