: తెలంగాణలో 'పది' విద్యార్థులపై సర్కారు 'ఆధార్' దెబ్బ!
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై కేసీఆర్ సర్కారు బాంబేసింది. ఆధార్ కార్డు లేకుంటే పరీక్షలు రాయనివ్వబోమని తేల్చి చెప్పడంతో దాదాపు లక్షన్నర మంది భవిష్యత్ గందరగోళంలో పడింది. ఆధార్ సంఖ్యలు లేని విద్యార్థుల దరఖాస్తులు స్వీకరించవద్దని అన్ని జిల్లాల డీఈఓలకు విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఆధార్ పూర్తి చేసినట్టు ధ్రువపత్రాలు తీసుకున్నాకే నామినల్ రోల్స్ అనుమతించాలని విద్యాశాఖ సూచించడంతో, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. తాజా ఉత్తర్వుల్లో భాగంగా ఎంతమంది విద్యార్థులున్నా ఒక్కరికి ఆధార్ లేకపోయినా, మిగిలినవారందరి పరీక్షా దరఖాస్తులను స్వీకరించరు. ఇక నామినల్ రోల్స్ అందించేందుకు డిసెంబరు 2 ఆఖరు కాగా, ఈలోగా అందరికీ ఆధార్ తేవడం అసాధ్యమని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో 6 లక్షల మంది ఈ విద్యా సంవత్సరంలో టెన్త్ చదువుతుండగా, అందులో 1.5 లక్షల మందికి పైగా ఆధార్ లేదని తెలుస్తోంది.