: మంత్రికి ఎదురు సమాధానం ఇచ్చిన మహిళా ఐపీఎస్ పై బదిలీ వేటు
హర్యాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తో వాగ్వాదం చేసిన ఐపీఎస్ అధికారిణి సంగీతా కాలియాపై బదిలీ వేటు పడింది. నిన్న ఫతేహబాద్ గ్రీవెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మద్యం దొంగతనాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో సరిహద్దుల్లో దొంగతనాలు పెరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మంత్రి ఎస్పీ సంగీతా కాలియాను నిలదీశారు. ఈ సందర్భంగా మద్యం దొంగతనాలపై 2,500కు పైగా కేసులు నమోదు చేశామని, చాలా మందిని న్యాయస్థానం ముందు నిలబెట్టామని, బెయిలుపై బయటికి వచ్చిన నేరగాళ్లే మళ్లీ మళ్లీ నేరాలు చేస్తున్నారని ఆమె మంత్రికి తెలిపారు. ఆమె సమాధానానికి సంతృప్తి చెందని మంత్రి ఆమెను గెటౌట్ అని ఆదేశించారు. దీనికి ఆమె తాను వెళ్లేది లేదని స్పష్టం చేయడంతో, సమావేశం నుంచి మంత్రి అనిల్ విజ్ వెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటనపై మంత్రి డీజీపీ, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.