: అమీర్ ఖాన్ వ్యాఖ్యలు బీజేపీకే కాదు స్నాప్ డీల్ కు కూడా లాభం చేకూర్చాయి
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు స్నాప్ డీల్ కు కూడా లాభం చేకూర్చాయి. దేశంలో సాహితీ వేత్తల అవార్డులు వెనక్కివ్వడం, గోమాంసం ఉదంతం, హిందూత్వ వ్యాఖ్యలతో బీహార్ ఎన్నికల పరాజయం బీజేపీ ప్రతిష్ఠను మసకబార్చాయి. ఈ దశలో మత అసహనంపై అమీర్ చేసిన వ్యాఖ్యలు దేశంలోని హిందూత్వ వాదులను ఏకతాటిపైకి తెచ్చాయి. వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. అమీర్ ఖాన్ మాట్లాడింది తప్పంటూ విమర్శించారు. ఘర్ వాపసీ తరహాలో యాప్ వాపసీ కార్యక్రమం చేపట్టిన హిందూత్వ వాదులు, మొబైల్స్ నుంచి స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన స్నాప్ డీల్ అమీర్ వ్యాఖ్యలకు, తమ సంస్థకు సంబంధం లేదని, తమ సంస్థకు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే అని స్పష్టం చేసింది. దీంతో వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఈ యాప్ 28వ స్థానంలో ఉంది. వ్యతిరేక ప్రచారం పెరిగిపోవడంతో అమీర్ కు మద్దతుగా నిలిచిన వారు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో మరు సటి రోజు 27వ ర్యాంకుకు చేరిన స్నాప్ డీల్ ఐదు రోజులు ముగిసేసరికి ఏకంగా 22వ ర్యాంకుకు చేరుకుంది. ఆ విధంగా అమీర్ వ్యాఖ్యలు స్నాప్ డీల్ కు చెడు కంటే మంచే చేస్తున్నాయి.