: మన్మోహన్ సింగ్ సాయం!... మోదీ టీ పార్టీకి సోనియా హాజరు
కేంద్ర ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తున్న జీఎస్టీ బిల్లును పార్లమెంటులో పాస్ చేయించుకునేందుకు ఓ అడుగు కిందకు దిగింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆమోదం లేకుండానే బిల్లును పాస్ చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ, జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లను ఆయన నిన్న తేనీటి విందుకు ఆహ్వానించారు. అధికార పక్షం వ్యూహాన్ని అర్థం చేసుకున్న సోనియా గాంధీ ఈ విందు రాజకీయం పట్ల అంతగా ఆసక్తి కనబరచలేదు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ మరో ఎత్తుగడ వేశారు. మాజీ ప్రధానిగానే కాక విఖ్యాత ఆర్థికవేత్తగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ సాయం కోరారు. తేనీటి విందుకు సోనియాను ఒప్పించే బాధ్యత మీదేనంటూ ఆయనపైనే మోదీ భారం ఉంచారు. మన్మోహన్ సింగ్ ప్రతిపాదించడంతో సోనియా గాంధీ ఆ విందుకు వెళ్లారు. వెరసి జీఎస్టీ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య ఓ అర్థవంతమైన చర్చ జరిగింది.