: నితీశ్ ది ధైర్యంతో కూడిన నిర్ణయం... ఆయనను చూసి నేర్చుకోండి: జయకు డీఎంకే సూచన
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ప్రతిపక్ష డీఎంకే నేతలు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించే విషయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీహార్ లో మద్య నిషేధం విధిస్తున్నట్టు నితీశ్ ప్రకటించడం ఎంతో ధైర్యంతో కూడుకున్న నిర్ణయమని చెప్పారు. మద్యానికి బానిసలైన ఎంతో మంది తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని... అయినా జయ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా మద్య నిషేధం దిశగా జయలలిత అడుగులు వేయాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. మద్య నిషేధాన్ని ప్రతిపక్ష డిమాండ్ గా కాకుండా ప్రజల డిమాండ్ గా పరిగణించాలని సూచించారు.