: టీమిండియా అద్భుతంగా ఆడిందా?
మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్ ను ఇంకో టెస్టు మిగిలి ఉండగానే భారత జట్టు కైవసం చేసుకుంది. రెండు టెస్టులు గెలిచిన టీమిండియా విజయోత్సాహంలో ఉంది. ఈ దశలో టీమిండియా విజయంపై చర్చరేగుతోంది. టీమిండియా అద్భుత ఆటతీరుతో విజయం సాధించిందా? లేక ప్రత్యర్థిని మోసం చేసి విజయం సాధించిందా? అనే ఆలోచన రేగుతోంది. ద్వైపాక్షిక సిరీస్ అని, ప్రపంచంలో పటిష్ఠమైన జట్టును సిరీస్ కు ఆహ్వానించి, ఒటమి భయంతో అనుకూలమైన స్పిన్ పిచ్ లను తయారు చేసుకుని గెలవడం కూడా ఓ గెలుపేనా? అని కొంత మంది పెదవి విరుస్తున్నారు. అయితే క్రికెట్ లో ఆతిథ్యదేశానికి అనుకూలంగా పిచ్ లు తయారు చేసుకోవడం ఆనవాయతీగా వస్తున్నదేనని, అందులో టీమిండియాను తప్పు పట్టాల్సిన అవసరం లేదని మరి కొంతమంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి గెలుపు ఆటగాళ్ల ప్రతిభను అంచనా వేయగలిగినది కాదని, ఈ ప్రతిభతో విదేశాల్లో రికార్డులు మెరుగుపరుచుకోవడం సాధ్యం కాదని వెటరన్ లు పేర్కొంటున్నారు. పిచ్ లను అనుకూలంగా మలచుకునే కంటే ఆటను మెరుగుపరుచుకోవడం ఉత్తమం అని వారు సూచిస్తున్నారు. పిచ్ పై దృష్టి పెట్టేకంటే ప్రణాళికల మీద దృష్టి పెట్టడం మేలు చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతిభను సానబెట్టుకుంటూ విజయాలు సాధించడం ఆట భవిష్యత్తును పెంచుతుందని, అలా కాకుంటే ఆట అధోగతి పాలై, ఆదరణ కోల్పోతుందని, అలాంటి పరిస్థితి టీమిండియా తెచ్చుకోకూడదంటే పిచ్ పై దృష్టిపెట్టడం తగ్గించి, ఆటపై మనసు లగ్నం చేయాలని వారు హెచ్చరిస్తున్నారు.