: మతం మారిన ఎస్సీ, ఎస్టీల సంగతేంటి?: అరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో పార్లమెంటులో పెను రభస
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ను కుదిపేశాయి. ఈ మధ్యాహ్నం రాజ్యాంగంపై రాజ్యసభలో ప్రసంగిస్తూ, 1975 నాటి అత్యవసర పరిస్థితులను గుర్తు చేశారు. ఆపై మతం మారిన ఎస్సీ, ఎస్టీలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, జర్మనీ నియంత హిట్లర్ ఒకే మనస్తత్వం ఉన్నవారని ఆనడంతో విపక్ష సభ్యులు, ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. "ఇవాళా రేపు ప్రతి ఒక్కరూ టీవీల ముందుకు వచ్చి బాధ్యతారహిత ప్రకటనలు చేస్తున్నారు. అసహనం అంటే ఇదే. ఇంతకుముందు ప్రజల జీవితాలనే చట్టవ్యతిరేకంగా లాగేసుకున్నారు. ఆనాటి ఘటనలకు, నేటి ఘటనలకు పోలిక లేదు. ఒకవేళ పోల్చాల్సి వస్తే, ఇందిరా గాంధీ పాలన, అత్యవసర పరిస్థితి ఓ పర్వతమైతే, ఈ అసహనం ఓ గులకరాయి వంటిది" అని అభిప్రాయపడ్డారు. జర్మనీలో హిట్లర్ కు, ఇందిరకు దగ్గరి పోలికలున్నాయని జైట్లీ విమర్శించారు. కొంత రభస తరువాత తిరిగి ప్రసంగిస్తూ, "రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఎస్సీ, ఎస్టీలకు, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులను కల్పించింది. ఆర్టికల్ 29, 30లలో మైనారిటీలకు ప్రత్యేక హక్కులున్నాయి. మరి ఎస్సీ, ఎస్టీలుగా ఉండి ఇతర మతాల్లోకి మారినవారి సంగతేంటి? వారు రెండు రకాలుగా ప్రయోజనాలు పొందడం లేదా?" అని ప్రశ్నించడంతో మరింత రభస చెలరేగింది.