: మారన్ కస్టడీ కుదరదు... విచారణకైతే ఓకే!: సీబీఐకి సుప్రీంకోర్టు కొత్త ఆఫర్
కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ ను విచారించేందుకు అనుమతివ్వాలన్న సీబీఐ వినతికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వినూత్నంగా స్పందించింది. పోలీస్ కస్టడీకి అయితే అనుమతి ఇవ్వలేమని చెప్పిన సుప్రీం ధర్మాసనం, సాధారణ విచారణకైతే ఓకేనంటూ స్పందించింది. సుప్రీంకోర్టు కొత్త ఆఫర్ కు అంతే వేగంగా స్పందించిన సీబీఐ కూడా సాధారణ విచారణకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపింది. దీంతో దయానిధి మారన్ ను ఆరు రోజుల పాటు విచారించేందుకు సీబీఐ అధికారులకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వందలాది టెలిఫోన్ కనెక్షన్లను తన ప్రైవేట్ కార్యాలయంతో పాటు ఇంటిలోనూ ఏర్పాటు చేసుకున్న మారన్ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించారనేది ఆయనపై నమోదైన ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఆయన తాజాగా ఆరు రోజుల పాటు సీబీఐ అధికారుల వద్దకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.