: మీరు స్పాట్ చెప్పండి, మేము బాంబులేస్తాం: ఒబామాతో పుతిన్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను సిరియాలో పూర్తిగా అణగదొక్కే క్రమంలో తాము చేస్తున్న యుద్ధానికి సహకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ఒబామాను కోరారు. అమెరికా అంతరిక్షంలో ఉంచిన అత్యాదునిక శాటిలైట్ల ద్వారా ఉగ్రవాదుల అనుపానులను గుర్తించి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలను చెబితే, తాము నిమిషాల్లో అక్కడికి వెళ్లి విధ్వంసం సృష్టించి వస్తామని పుతిన్ వెల్లడించారు. సరైన ప్రాంతం గురించిన సమాచారం లేకుండా వెళితే, సామాన్యుల ప్రాణాలు కూడా పోతున్నాయని, అందువల్ల సరిగ్గా ఎక్కడ బాంబుల వర్షం కురిపించాలో తెలియజేయాలని పుతిన్ కోరారు. కాగా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనను అమెరికా వ్యతిరేకిస్తుంటే, రష్యా మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అభిప్రాయాలు ఒకటికానప్పటికీ, ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై పోరు విషయంలో మాత్రం ఇరు దేశాలూ కలసి పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.