: తాత చంకలో తల నిండా జుట్టుతో వెళ్లి... తండ్రి చేతిలో గుండుతో ప్రత్యక్షమైన దేవాన్ష్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి మనవడు దేవాన్ష్ కేశఖండన కార్యక్రమం పూర్తి అయ్యింది. నేటి ఉదయం తాత చంద్రబాబు చంకలో తల నిండా జుట్టుతో కనిపించిన ఆ బాలుడు కేశఖండన కార్యక్రమం తర్వాత తండ్రి నారా లోకేశ్ చేతిలో గుండుతో ప్రత్యక్షమయ్యాడు. దేవాన్ష్ పుట్టు వెంట్రుకల సమర్పణ కోసం చంద్రబాబు కుటుంబంతో సహా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబం నిన్న సాయంత్రానికే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చేరుకుంది. నేటి ఉదయం ఇరు కుటుంబాలు బంధుమిత్రులతో కలిసి చంద్రబాబు కులదైవం నాగాలమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశాయి. ఈ సందర్భంగా కొత్త బట్టలతో ముస్తాబైన దేవాన్ష్ తన తాత చంద్రబాబు చంకలో ముద్దులొలుకుతూ కనిపించాడు. దేవాన్ష్ ను ఎత్తుకుని ప్రత్యేకంగా తయారు చేయించిన గొడుగు కింద చంద్రబాబు కాలి నడకన నాగాలమ్మ గుడి చేరుకున్నారు. అనంతరం అరగంట పాటు సాగిన కేశఖండన కార్యక్రమం తర్వాత దేవాన్ష్ తన తండ్రి నారా లోకేశ్ చేతిలో గుండుతో ప్రత్యక్షమయ్యాడు.