: గూగుల్ రూ. 2 కోట్ల వేతనం నిజం కాదు... ఇకపై ఐఐటియన్ల 'ఆఫర్లు' చెప్పరట!
పుణె విద్యార్థి అభిషేక్ పంత్... తనకు గూగుల్ లో రూ. 2 కోట్ల ఆఫర్ తో ఉద్యోగం లభించిందని మీడియాకు వెల్లడించిన వేళ, అతను చదివిన ఖరగ్ పూర్ ఐఐటీ అధ్యాపకులు, యాజమాన్యానికి తలనొప్పి మొదలైంది. అతనికన్నా మార్కులు అధికంగా పొందిన ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, ఐటీ కంపెనీల అధికారులు, జాతీయ మీడియా నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు సమాధానం చెప్పలేక వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమాచారాన్ని తాము బయటకు వెల్లడించలేదని ఐఐటీ అధికారులు మొత్తుకోవాల్సి వచ్చింది. ఈ గొడవతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన ఆల్ ఐఐటీస్ ప్లేస్ మెంట్ కమిటీై ఇకపై ఐఐటీల్లో జరిగే అన్ని ఫైనల్ ప్లేస్ మెంట్లలో విద్యార్థులకు వచ్చే వేతన ఆఫర్ల గురించిన సమాచారాన్ని బయటకు వెల్లడించరాదన్న నిర్ణయాన్ని తీసుకుంది. కాగా, పుణె విద్యార్థికి గూగుల్ నుంచి రూ. 2 కోట్ల ప్యాకేజీ వచ్చిందన్నది అవాస్తవమని, అంతకన్నా తక్కువ ఆఫర్ నే ఆ విద్యార్థి పొందాడని ఖరగ్ పూర్ ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. అతని కుటుంబసభ్యుల నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఓ అధికారి వెల్లడించారు. ప్లేస్ మెంట్ల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అతిగా స్పందిస్తున్నారని, ఇకపై తాము సరాసరి వేతన వివరాలు మాత్రమే వెల్లడిస్తామని గౌహతి, బాంబే ఐఐటీల అధికారులు స్పష్టం చేశారు.