: రూ. 20 వేల పైనున్న హెచ్టీసీని రూ. 10 వేల కిందకు దింపిన 'పోటీ'!


ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. ప్రతి ఒక్కరి చేతులూ స్మార్ట్ ఫోన్లతో కళకళలాడుతున్న వేళ, ఈ రంగంలో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీయే నిన్నటి వరకూ రూ. 20 వేలకు పైగా ధరల్లోనే మొబైల్ ఫోన్లను మార్కెటింగ్ చేసిన హెచ్టీసీ, రూ. 10 వేలకన్నా తక్కువ ధరకు ఫోన్లను తయారు చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. రూ. 3 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్లు లభిస్తున్న వేళ, తాము అధిక ధరలకు విక్రయిస్తుంటే, కొనుగోలుదారులు లభించడం లేదని భావించిన సంస్థ చౌకబాట పట్టింది. గ్రామీణ భారతావనిలోని అపార మార్కెట్ పై దృష్టిని సారించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చియాలిన్ చాంగ్ వెల్లడించారు. తైవాన్ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ టచ్ స్క్రీన్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన వేళ మంచి అమ్మకాలనే సాధించింది. ఆపై చిన్న కంపెనీల రాకతో హెచ్టీసీకి ఆదరణ తగ్గింది. తాజాగా ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇండియాలో కొత్త ఫోన్లను విడుదల చేసిన రెండో సంస్థగా గుర్తింపు తెచ్చుకున్నా, విక్రయాలు మాత్రం పెరగలేదు. దీంతో రూ. 5 వేల నుంచి రూ. 10 వేల మధ్య ధరల్లో ఫోన్లు అమ్మాలని నిర్ణయించింది. కాగా, సైబర్ మీడియా రీసెర్చ్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం హెచ్టీసీ మార్కెట్ వాటా ఒక శాతం మాత్రమే ఉంది. ఇక ఈ చౌక ఫోన్లతో సంస్థ అదృష్టం మారుతుందా? అన్నది వేచి చూడాలి.

  • Loading...

More Telugu News