: 2016లో ఉద్యోగుల వేతన పెంపు అంతంతమాత్రమే!
వచ్చే సంవత్సరం ఇండియాలోని ఉద్యోగుల వేతనపెంపు అంతంతమాత్రంగానే ఉండనుందని తాజాగా వెల్లడైన ఓ నివేదిక పేర్కొంది. సరాసరిన 10.8 శాతం వేతన పెరుగుదల ఉంటుందని, 6.1 శాతం ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఉద్యోగికి సగటున 4.7 శాతం వరకూ నికర వేతన వృద్ధి ఉంటుందని 'టవర్స్ వాట్సన్' వెల్లడించింది. 2015-16 సంవత్సరానికి గాను 'ఆసియా పసిఫిక్ శాలరీ బడ్జెట్ ప్లానింగ్' రిపోర్టును సంస్థ విడుదల చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో అసంతృప్తికరంగా ఉన్న కార్పొరేట్ ఫలితాలు వేతనాల పెరుగుదలకు ప్రధాన అడ్డంకని అభిప్రాయపడింది. ఇక వేతన పెరుగుదలపై 41 శాతం మంది పాజిటివ్ దృక్పథంతో ఉన్నారని పేర్కొంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి సరాసరిన 12.5 శాతం వరకూ, యావరేజ్, ఎబౌ యావరేజ్ ఉద్యోగులకు వరుసగా 9.7 శాతం, 11 శాతం వరకూ వేతనాలు పెరగవచ్చని, మొత్తం మీద ఆసియా పసిఫిక్ రీజియన్లో వేతన బడ్జెట్ 6.8 శాతం వరకూ పెరగనుందని అంచనా వేస్తున్నట్టు టవర్స్ వాట్సన్ డేటా సర్వీసెస్ విభాగం అధికారి సంభవ్ రాక్యాన్ వెల్లడించారు.