: పార్లమెంటులో విపక్షాలపై వెంకయ్య చమక్కులు, సెటైర్లు!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పార్లమెంటులో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగా ప్రసంగిస్తూ, తనదైన శైలిలో విపక్షాలపై చమక్కులు వదిలారు. తన ప్రసంగానికి కాంగ్రెస్ తదితర విపక్ష సభ్యులు అడ్డుపడగా, "మీకు గాని క్యారెక్టర్, కాలిబర్, కెపాసిటీ, కాండక్ట్, డిసిప్లేన్, డైనమిజమ్, డెడికేషన్, డివోషన్ ఉంటే... మీరంతా ప్రధాని మోదీని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే" అని అనడంతో బీజేపీ సభ్యులు చప్పట్లతో మద్దతు పలికారు. మోదీ వంటి ముందుచూపున్న ఓ మంచి నేత ప్రధానిగా ఉండటం భారత ప్రజల అదృష్టమని వ్యాఖ్యానించిన ఆయన, రాజ్యాంగంలోని పీఠిక విషయమై విపక్షాలు లేనిపోనివి కల్పించి చెబుతున్నాయని విమర్శించారు. భారత ప్రజలు నైతికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని అంబేద్కర్ తపించారని, ఆయన ఆశయాలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు.