: పంచె కట్టి, మనవడిని ఎత్తుకుని... కాలి నడకన ఆలయానికి చంద్రబాబు!


మనవడి పుట్టు వెంట్రుకలను తీయించేందుకు సొంతూరికి వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాలనా వ్యవహారాలను కాస్తంత పక్కనబెట్టి సేద తీరారు. నిన్న సాయంత్రమే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు అక్కడి తన సొంతింటిలో తొలుత ఓ గంట పాటు సేదదీరారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన ఆయన తదనంతరం గ్రామ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బస చేసిన చంద్రబాబు నేటి ఉదయం కులదైవం నాగాలమ్మ ఆలయానికి బయలుదేరారు. రోటీన్ వస్త్రధారణకు భిన్నంగా పంచె కట్టిన చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చంకనెత్తుకుని కాలి నడకన ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన గొడుగు కింద మనవడిని ఎత్తుకుని చంద్రబాబు నడిచారు. చంద్రబాబుకు ఓ పక్క ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రహ్మణి నడవగా... మరో పక్క తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయనను అనుసరించారు. నారా, నందమూరి కుటుంబాలు పక్కపక్కనే నడుస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఈ అరుదైన దృశ్యాలను గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News