: మూడేళ్ల బాలిక 13 కి.మీ నడిచి వెళుతుంటే... ఎవరూ గుర్తించలా!
మూడేళ్ల చిన్నారి. మిగతా స్నేహితులతో కలసి చాక్లెట్ల కోసం వీధిలోకి వెళ్లి తిరిగి రాలేదు. ఢిల్లీలో మురికివాడలు అధికంగా ఉండే జామియా నగర్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇది జరిగింది. సాయంత్రం 6 గంటలకు విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, రాత్రి వరకూ వెతికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే చిన్నారుల కిడ్నాప్ లు అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయని, పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి పోలీసులకు ముప్పుతిప్పలు మొదలయ్యాయి. డీసీపీ మన్ దీప్ రాంధ్వా స్వయంగా రంగంలోకి దిగి బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి వారి సెర్చింగ్ మొదలైంది. బాలిక చిత్రాలను అన్ని పోలీసు స్టేషన్లకూ పంపించి, మిస్సింగ్ చిన్నారుల పోర్టల్ 'జిప్ నెట్'లో కూడా ఉంచిన పోలీసులు ఢిల్లీ, నోయిడా, గుర్ గాన్ ప్రాంతాల్లోని అందరినీ సెర్చింగ్ లో భాగం చేశారు. బార్డర్ పోలీసులకు, పెట్రోలింగ్ వాహనాలకు సమాచారం ఇచ్చారు. బుధవారం సాయంత్రం... బాలిక తప్పిపోయి ఒక రోజు దాటుతోంది. ఇక లాభం లేదనుకున్న పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. జామియా పరిధిలోని 1000కి పైగా ఇళ్లలో డోర్ టూ డోర్ తనిఖీలు చేపట్టారు. వీధుల్లో చిరు వ్యాపారుల నుంచి ఆటో డ్రైవర్లు, తోపుడు బండ్ల వారందరినీ విచారించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఎక్కడా క్లూ లభించలేదు. దాదాపు 36 గంటల పాటు ఆపరేషన్ సాగినా బాలిక ఆచూకీ తెలియరాలేదు. ఆందోళన పెరుగుతున్న వేళ, జైత్ పూర్ సమీపంలో వెతుకుతున్న కానిస్టేబుళ్లు రాజేష్, రణవీర్ లకు ఓ చిన్న క్లూ లభించింది. ఓ మహిళ, ఇదే పోలికలతో ఉన్న బాలికను నోయిడాలోని సెక్టార్ 94లో చూసినట్టు చెప్పింది. వెంటనే అక్కడ వాలిపోయిన పోలీసులు 200 గృహాలను తనిఖీ చేశారు. ఓ వృద్ధురాలి ఇంట బాలిక కనిపించింది. రోడ్డుపక్కన ఏడుస్తున్న బాలికను ఇంటికి తెచ్చినట్టు ఆవిడ వెల్లడించగా, బాలికను పరీక్షించిన వైద్యులు ఏ ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. ఇక మూడేళ్ల చిన్నారి జామియా నుంచి నోయిడా వరకూ ఎలా వెళ్లింది?... తనంతట తాను నడుచుకుంటూ 13 కిలోమీటర్ల దూరం వెళ్లింది. ఆ బాలికను ఎంత మంది చూసి వుంటారు? దారిన వెళుతున్న ఎవరికీ, ఈ పాప ఒంటరిగా ఎందుకు వెళుతుందన్న అనుమానం రాలేదా? ఏమీ జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది? సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం మొదలైన చర్చ ఇది. కాగా, బాలికను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుళ్లకు రివార్డులను అందించనున్నట్టు దీపక్ మిశ్రా ప్రకటించారు.