: నారావారిపల్లెలో చంద్రబాబు ఫ్యామిలీ... బాలయ్య దంపతులు కూడా!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న సాయంత్రానికి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లె చేరుకున్నారు. విజయవాడ నుంచి రేణిగుంట మీదుగా ఆయన తన సొంతూరు చేరుకున్నారు. నారావారిపల్లెలోని తన సొంతింటిలో గంట పాటు సేదదీరిన చంద్రబాబు, ఆ తర్వాత బటయకు వచ్చి గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. తన మనవడు దేవాన్ష్ తలనీలాల కార్యక్రమానికి హాజరయ్యేందుకే ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఇదిలా ఉంటే, చంద్రబాబు కంటే ముందుగానే ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు సతీమణి ఇందిర, కోడలు నారా బ్రాహ్మణిలు చిన్నారి దేవాన్ష్ తో కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. నేడు దేవాన్ష్ కు తలనీలాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు కుల దైవం నాగాలమ్మ ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.