: హార్దిక్ పటేల్ తల్లి, సోదరి అరెస్ట్... నిరసన ప్రదర్శనకు సన్నాహమే కారణమట!
ఒక్క సభతో అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాక కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వెన్నులో సైతం వణుకు పుట్టించిన యువ సంచలనం హార్దిక్ పటేల్ కుటుంబానికి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రాజద్రోహం కేసు కింద అరెస్టైన హార్దిక్ పటేల్ సూరత్ జైల్లో ఉన్నారు. తాజాగా ఆయన తల్లి ఉషా బెన్, ఆయన సోదరి మోనికలతో పాటు మరో ఆరుగురు మహిళలను వీరంగామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని గంటల పాటు వారిని స్టేషన్ లోనే కూర్చోబెట్టిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ వీరంగామ్ కు వచ్చారు. తమ సొంతూరు వచ్చిన సీఎం ముందు నిరసన ప్రదర్శన చేపట్టేందుకు హార్దిక్ తల్లి, సోదరి సిద్ధమయ్యారట. అయితే దీనిపై కాస్తంత ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరితో పాటు నిరసన ప్రదర్శనకు సిద్ధపడ్డ మరో ఆరుగురు మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత వారిని విడిచిపెట్టారు.