: బెదిరింపుల నేపథ్యంలో ఫేస్ బుక్ ఖాతా మూసేసిన కేరళ జర్నలిస్టు
చిన్నతనంలో తనకు జరిగిన వేధింపుల అనుభవాలను వెల్లడించిన కేరళ మహిళా జర్నలిస్టుపై ఆమె మతానికి చెందిన వ్యక్తులు విరుచుకుపడుతున్నారు. కోజికోడ్ లోని మదర్సాలో చదువుకున్న సమయంలో సహ విద్యార్థుల లైంగిక వేధింపులకు గురయ్యానని వీపీ రెజీనా తన ఫేస్ బుక్ పేజ్ లో తెలిపారు. అక్కడి ఉస్తాద్ లేదా టీచర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు దిగేవారని ఆమె పేర్కొన్నారు. రాత్రి తరగతుల్లో కూడా అతని వేధింపులు ఆగేవి కాదని ఆమె వెల్లడించారు. అతని వేధింపులు తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు చదువు మానేశారని ఆమె వివరించారు. ఇప్పుడిది చూసి ఎవరైనా తనను చంపుతానని బెదిరించినా భయపడేది లేదని ఆమె స్పష్టం చేశారు. అల్లా తన పక్షాన ఉన్నాడని ఆమె తెలిపారు. పితృస్వామ్య వ్యవస్థను ఇస్లాం వ్యతిరేకిస్తుందని, పొరపాటున వ్యతిరేకంగా మాట్లాడితే మహిళలను లక్ష్యం చేసుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆమెపై ఆ మతానికి చెందిన వ్యక్తులు విరుచుకుపడ్డారు. బెదిరింపులు మొదలయ్యాయి. మతం గొప్పతనం మంటకలుపుతున్నావంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆమెకు కొంత మంది మద్దతు పలికినా వివాదానికి ముగింపు పలుకుతూ ఆమె తన ఫేస్ బుక్ పేజ్ ని బ్లాక్ చేశారు.