: మోదీ కొత్త ఆలోచన... 'అందరికీ ఇళ్లు' స్కీములో చౌకగా విద్యుత్, మంచి నీరు!
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ సొంతింటిని అందించాలన్న ఆలోచనతో మోదీ ప్రారంభించిన 'అందరికీ ఇళ్లు' స్కీములో భాగంగా మరిన్ని నిధులను కేటాయించాలని కేంద్రం యోచిస్తోంది. సమీప భవిష్యత్తులో నిర్మించే ఇళ్లకు చౌకగా విద్యుత్, నీటిని అందించాలని, ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి, నిర్మాణ రంగంలో కూలీలు సైతం తక్కువ ధరలకు లభించేలా చూడాలని యోచిస్తోంది. దాదాపు 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 3 కోట్ల గృహాలను నిర్మించాలన్నది మోదీ అభిమతం. కాగా, నిన్నమొన్నటి వరకూ అమలైన ఇందిరా ఆవాస్ యోజనా (ఐఏవై) స్కీము స్థానంలో 'ప్రైమ్ మినిస్టర్స్ హౌసింగ్ ఫర్ ఆల్' పథకాన్ని నడపాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. గతంలో ఐఏవైలో భాగంగా రూ. 70 వేల నుంచి రూ. 75 వేల మధ్య ఒక్కో గృహాన్ని నిర్మించగా, ఇప్పుడా మొత్తాన్ని మరింతగా పెంచాలని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆరంభ దశలో 2 కోట్ల గృహాల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని, ఒక్కో ఇంటికి రూ. 1.5 లక్షల వరకూ వెచ్చించాలన్నది గృహ నిర్మాణ శాఖ ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ గృహాలకు సాధారణ యూనిట్ విద్యుత్ చార్జీతో పోలిస్తే, రాయితీలు కల్పించాలని, సరఫరా చేసే మంచి నీటిని కూడా తగ్గింపు ధరలకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ అధికారి తెలిపారు. ఎస్ఈసీసీ లెక్కల ప్రకారం, ఇండియాలో ప్రస్తుతం గ్రామీణ భారతావనిలో 17.95 కోట్ల కుటుంబాలు నివసిస్తుండగా, 13.3 శాతం మందికి మాత్రమే సరైన గృహ వసతి ఉంది. వీరిలో అత్యధికులు ఒక గది ఉన్న ఇల్లు లేదా కచ్చా గోడల మధ్య ఉంటున్నారు.