: రెండు రోజులు కాకుండానే 30 వికెట్లు రాలిపోయాయి!
అసలు సిసలు స్పిన్ మాయాజాలం ఆటగాళ్ల కళ్లముందు కదలాడిన వేళ, రెండు రోజుల ఆట కూడా పూర్తి కాకుండానే 30 వికెట్లు నేలరాలాయి. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు రెండో రోజున భారత రెండో ఇన్నింగ్స్ ముగిసేసరికి 18 వికెట్లు పడిపోయాయి. తొలి రోజున టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 78.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ప్రారంభించి రెండు వికెట్లను నష్టపోయింది. ఇక నేటి ఉదయం దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ మొదలు కాగానే వికెట్లు టపటపా రాలాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, భారత స్పిన్నర్లు విసురుతున్న బంతులకు సమాధానం చెప్పలేక కుదేలు కాగా, 33.1 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆ జట్టు పెవీలియన్ కు చేరింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు సైతం అదే దారిలో నడుస్తూ, 46.3 ఓవర్లకు 173 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో రెండు రోజుల ఆట ముగియకుండానే, మూడు ఇన్నింగ్స్ లు పూర్తి కాగా, 30 వికెట్లు పడిపోయాయి. వీటిల్లో స్పిన్నర్లకు 25 వికెట్లు దక్కడం గమనార్హం. ఇక తమ ముందు భారీ పర్వతంలా కనిపిస్తున్న 310 పరుగుల స్కోరును అందుకునేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఏం చేస్తుందో చూడాలి.