: కొనేవారేరి?... 8 ఏళ్ల కనిష్ఠానికి బంగారం డిమాండ్
ఇండియాలో బంగారానికి డిమాండ్ భారీగా పడిపోయింది. గడచిన పండగ సీజనులో బంగారం అమ్మకాలు పెంచుకోవాలని భావించిన ఆభరణాల వ్యాపారులకు నిరాశే ఎదురయింది. వరుసగా రెండేళ్లు కరవు పీడించడంతో లక్షలాది మంది రైతుల వద్ద ఆదాయం లేకపోవడం, ధరలు మరింతగా తగ్గుతాయని వచ్చిన విశ్లేషణలతో నూతన కొనుగోళ్లకు ప్రజలు దూరమయ్యారని నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న ఇండియాలో ఈ దసరా - దీపావళి సీజను బంగారం డిమాండ్ ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఐదేళ్ల కనిష్ఠస్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశవాళీ డిసెంబర్ త్రైమాసికం బంగారం డిమాండ్ 175 టన్నుల నుంచి 150 టన్నులకు తగ్గిందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయెలరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్చారాజ్ బమల్వా వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నాడు ఇదే పండగ సీజనులో 231 టన్నుల బంగారం దిగుమతి జరుగగా, గత సంవత్సరం సీజనులో 201.6 టన్నుల బంగారానికి డిమాండ్ వచ్చిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించాయి. కాగా, ఒకవైపు వివాహాది శుభకార్యాల సీజన్ కొనసాగుతున్నప్పటికీ, అమ్మకాలు అంతంతమాత్రంగా సాగుతుండటం ఆభరణాల వ్యాపారుల్లో ఆందోళనను పెంచుతోంది. దీపావళికి ముందు కొంతమేరకు అమ్మకాలు సాగినప్పటికీ, ఆపై కుదేలైపోయాయని కోల్ కతా కేంద్రంగా హోల్ సేల్ వ్యాపారం చేస్తున్న జేజే గోల్డ్ హౌస్ ప్రొప్రయిటర్ హర్షద్ అజ్మీరా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో డాలర్ తో రూపాయి మారకపు విలువ 5 శాతానికి పైగా క్షీణించడంతో అంతర్జాతీయ స్థాయిలో తగ్గినంతగా, బంగారం ధరలు ఇండియాలో తగ్గలేదని ఆయన గుర్తు చేశారు.