: పార్లమెంటును ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడి ప్రసంగం
పార్లమెంటులో టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. అంతకంటే ఎంతో ఆలోచింపజేసింది. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి, రాజ్యాంగాన్ని అవమానించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి సంబంధం లేకుండా విభజన చేశారని అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించలేదని, నియంత పాత్ర పోషించిందని ఆయన విమర్శించారు. పార్లమెంటులో అందరికీ న్యాయం జరగాలని భావిస్తూ, ఆ విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువ నివ్వలేదని అన్నారు. చేయని తప్పుకు ఆంధ్రప్రదేశ్ కు శిక్ష విధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు పని చేయాల్సిన పధ్ధతి ఇది కాదని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగం అమలు కావాలని ఆయన సూచించారు. పార్లమెంటు ముందుకు ప్రజలకు ఉపయోగపడే అంశాలు మాత్రమే బిల్లు రూపంలో రావాలని ఆయన సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి అంశాలు చాలా తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వాటిల్లో అయినా కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించాలని ఆయన తెలిపారు. రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగాన్ని ప్రధాని సహా సీనియర్లంతా సావధానంగా వినడం విశేషం. ఆయన ప్రసంగం ఇంగ్లీషులో ధాటిగా సాగుతుండగా ఓ ఎంపీ హిందీలో మాట్లాడాలని కోరడంతో హిందీలో కూడా కొనసాగించి రామ్మోహన్ నాయుడు ఆ విధంగా కూడా ఆకట్టుకున్నారు.