: ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసి 'ఓలా'కు వెళ్లిన సీఎఫ్ఓ!
గత నెలలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసిన సీఎఫ్ఓ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) రాజీవ్ బన్సాల్ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా'లో సీఎఫ్ఓగా చేరారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఆయన ఓలా లీడర్ షిప్ టీంలో చేరనున్నారని, ప్రస్తుత సీఎఫ్ఓ మితీష్ షా, బన్సాల్ టీంలో స్ట్రాటజిక్ ఫైనాన్స్ విభాగానికి అధిపతిగా ఉంటారని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ లో రాజీవ్ దీర్ఘకాల అనుభవం తమకెంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. శరవేగంగా ఎదుగుతూ, నిత్యమూ వేలాది మందికి క్యాబ్ సేవలను దగ్గర చేస్తున్న సంస్థ భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించనుందని ఆయన పేర్కొన్నారు. కాగా, అక్టోబరులో తన పదవికి రాజీనామా చేసినప్పటికీ, డిసెంబరు వరకూ సీఈఓ, ఇన్ఫీ బోర్డుకు సలహాదారుగా ఉండేందుకు రాజీవ్ బన్సాల్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అందువల్లే ఓలాలో చేరేందుకు ఆయన జనవరి వరకూ సమయం తీసుకున్నారని సమాచారం.