: అమ్మాయినిస్తాం, ఉద్యోగమిస్తాం... ఫైటర్ల కోసం ఐఎస్ఐఎస్ కొత్త హామీలు!
ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసేందుకు ఐఎస్ఐఎస్ నియామకాల టీం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా, అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని, ఉద్యోగం ఇస్తామని హామీలు గుప్పిస్తోంది. కేరళ రాష్ట్రంలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మహద్ జబ్బీర్ ను ఇటువంటి మాటలతోనే ప్రలోభపెట్టింది. ఒక్క జబ్బీర్ ను మాత్రమే కాదు. మరెంతో మందికి ఇటువంటి ఆశలను చూపింది. ఖొరాసన్ (ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ లోని కొంత భాగం)లో వాడుతున్న నల్ల జండాలను ఏలియా (రోమ్)లో ఎగరేయాలన్నదే తమ లక్ష్యమని, అందుకు సహకరించేందుకు వచ్చే ఫైటర్లకు అన్ని లగ్జరీలనూ దగ్గర చేస్తామని ఆశ పెట్టింది. గత నెలలో చెన్నై నుంచి టర్కీకి బయలుదేరిన ఇద్దరు ముస్లిం యువకులను విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విచారించగా, ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. పోలీసు వర్గాల కథనం ప్రకారం, సిరియాకు వచ్చి ఐఎస్ ఫైటర్లుగా మారితే వారిని యోధులుగా గుర్తిస్తామని వారికి చెప్పిందట. గత సంవత్సరం సెప్టెంబరులో నలుగురు భారత యువత, యూఏఈ మీదుగా సిరియాకు వెళ్లగా, వారంతా మంచి జీవితాన్ని, ఉత్తమ ఉద్యోగాలను పొందారని చెబుతూ, వారి వీడియోలు చూపిందట. రక్కాలో సకల సౌఖ్యాలనూ అనుభవించవచ్చని చెప్పిందట. ఇక తెలంగాణలోని యువత ఎవరైనా ఐఎస్ లో రావాలని భావించి, ఉగ్రవాదుల కాంటాక్టులోకి వెళితే, తొలుత నిధులను సమీకరించాలని సూచించిందట. విదేశాల నుంచి వచ్చే యువతకు తొలుత 'జీహాదీ యువతి'తో వివాహం జరిపిస్తామని, ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించిన తరువాతనే యుద్ధంలోకి దిగాలని ప్రలోభ పెట్టిందట.