: మెట్రో అలైన్ మెంట్ మార్చబోము... గత ఒప్పందం మేరకే పనులు: ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్
భాగ్యనగరి హైదరాబాదులో కొనసాగుతున్న మెట్రో రైల్ అలైన్ మెంట్ ను మార్చే ఉద్దేశమేదీ లేదని ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ చెప్పారు. మెట్రో పనుల్లో భాగంగా గతంలో నిర్ణయించిన ప్రకారం కాకుండా అసెంబ్లీ, పాతబస్తీలో మెట్రో రూటును మార్చనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనికి సంబందించి నాడు తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన గాడ్గిల్ వెనువెంటనే వెనక్కి తీసుకున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ మెట్రో అలైన్ మెంట్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. అంతేకాక మెట్రో రూటును మార్చాలంటూ ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చిచెప్పారు. మెట్రో అలైన్ మెంట్ మార్పునకు సంబంధించి ప్రభుత్వం తమకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆయన చెప్పారు. గతంలో కుదిరిన ఒప్పందం మేరకే పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.