: పెరిగే వయసును దాచేసే 'స్మార్ట్ ఫుడ్'!
పెరుగుతున్న వయసుతో పాటే శరీరాకృతిలో, ముఖ కళలో మార్పు కనిపించక తప్పదు. కాలం గడుస్తున్న కొద్దీ, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మోకాళ్ల నొప్పులు, బలహీనమయ్యే ఎముకలు, ముడతలు పడే ముఖ్యం... ఇలా ఎన్నో ఎన్నెన్నో! అయితే, ఆహారపు అలవాట్లు, తినే తిండిలో మార్పులతో పెరుగుతున్న వయసును దాచేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్ గా తినడం వల్ల మరింత కాలం పాటు యవ్వనపు ఛాయ ఉంటుందని చెబుతున్నారు. కురులు, ఎముకల పటుత్వానికి: మిథైల్ సల్పోనిల్ మిథేన్... దీన్నే ఎంఎస్ఎం అంటారు. ఇది ఎన్నో రకాల పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. సల్ఫర్ అధికంగా ఉండే ఆకుకూరల నుంచి కూడా శరీరానికి లభిస్తుంది. దీంతో ఎముకల కీళ్లు బలపడతాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ మారే వెన్నుపూస ఒంపు నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు కురులు కూడా మృదువుగా, నిగనిగలాడుతూ దీర్ఘకాలం యవ్వన సూచికలుగా నిలుస్తాయి. సోయా: అత్యుత్తమ యాంటీ ఏజింగ్ ఫుడ్ సోయా ప్రొటీనే. సోయా ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం ద్వారా, శరీరంలో సెక్స్ హార్మోనుల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు యవ్వనాన్ని అనుభవించగలుగుతారు. ప్లాంట్ స్టెరోల్స్: స్టెరోల్స్ లేదా స్టెరోలిన్స్ గా పిలుచుకునే ఈ తరహా కణాలు, గుమ్మడి విత్తనాలను తింటే రక్తంలో వేగంగా పెరుగుతాయి. వీటినే మృత్యు కణాలని కూడా అంటారు. రక్తంలోని కణాల్లో వ్యాధి నిరోధక శక్తిని ఇవి మరింతగా పెంచుతాయి. తద్వారా రోగాలు దరిచేరవు. ఆలివ్ ఆయిల్: ఎన్నో రకాల వ్యాధుల చికిత్సలో వినియోగిస్తున్న ఆలివ్ ఆయిల్ ను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా క్యాన్సర్, డెమెంటియా, గుండెపోటు వంటి వాటిని దూరం పెట్టొచ్చు. ఏవైనా సలాడ్స్ లో ఆలివ్ ఆయిల్ ను వాడటం ద్వారా అత్యుత్తమ ఫలితాన్ని పొందవచ్చు. ద్రాక్ష: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ద్రాక్షను తప్పనిసరిగా రోజువారీ డైట్ లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్ష తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటంతో పాటు అల్జీమర్స్ తో పాటు నరాల సంబంధిత వ్యాధులు దరిచేరవని సూచిస్తున్నారు.