: సిరియాకు మిసైల్స్ తరలించిన రష్యా... పెరిగిన ఉద్రిక్తత!
రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ సైన్యం పేల్చివేసిన తరువాత రెండు దేశాల మధ్యా ఉద్రిక్తత మరింతగా పెరిగింది. ప్రత్యక్ష యుద్ధానికి దిగబోమని అటు రష్యా, ఇటు టర్కీలు ప్రకటించినప్పటికీ, పరిస్థితి చేతులు దాటేలా ఉందని తెలుస్తోంది. సిరియాలోని రష్యన్ బేస్ కు లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లను రష్యా తరలించింది. ఇకపై తమ యుద్ధ విమానాలను కూల్చాలని చూస్తే, పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తాము కూడా మిసైళ్లను పేలుస్తామని రష్యన్ మిలటరీ వర్గాలు హెచ్చరించాయి. ఇక నాటోలో సభ్యత్వం ఉన్న ఓ దేశం, మరో దేశపు విమానాన్ని పేల్చడం గడచిన 50 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక రష్యా మరో అడుగు వేసి ఏదైనా టర్కీ విమానాన్ని కూల్చి ప్రతీకారం తీర్చుకున్న పక్షంలో, రష్యాపై యుద్ధం చేసేందుకు నాటో దళాల సాయాన్ని టర్కీ కోరవచ్చని తెలుస్తోంది.