: బొక్కబోర్లా పడ్డ దక్షిణాఫ్రికా... 79 పరుగులకే ఆలౌట్
భారత బౌలర్ల స్పిన్ ధాటికి దక్షిణాఫ్రికా కుదేలైంది. గింగిరాలు తిరుగుతూ వస్తున్న బంతులకు దక్షిణాఫ్రికా ఆటగాళ్ల వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో నాగపూర్ లో జరుగుతున్న మూడవ టెస్టులో 33.1 ఓవర్లలో 79 పరుగుల వద్ద సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ ను ముగించగా, భారత్ కు 136 పరుగుల ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డుమినీ మాత్రమే 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. వాన్ జిల్, డెవిలియర్స్ ఖాతా తెరవకుండానే పెవీలియన్ దారి పట్టగా, ఆమ్లా, డీజే విలాస్, మోర్కెల్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ కు 5, జడేజాకు 4, మిశ్రాకు 1 వికెట్ లభించాయి. మరికాసేపట్లో భారత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.