: 'మా చివరి ఆదాయం ఇదే' అంటూ... చరిత్రలో కలసిపోయిన హ్యూలెట్ - పాకార్డ్!
'హ్యూలెట్ - పాకార్డ్'... మనం ముద్దుగా పిలుచుకునే పేరు 'హెచ్పీ'. కంప్యూటర్ ప్రపంచంలో ఈ పేరు వినబడని దేశం లేదు, వినని వారూ లేరంటే అతిశయోక్తి కాదు. అటువంటి టెక్ దిగ్గజం తమ తుది ఆదాయ వివరాలు చెప్పి చరిత్రలో కలిసిపోయింది. ఈ నెలారంభంలోనే సంస్థ రెండు భాగాలుగా విడిపోనుందని, ఇకపై 'హెచ్పీ' రెండు వేర్వేరు బ్రాండ్లుగా పని చేస్తుందని సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సాఫ్ట్ వేర్, బిజినెస్ సేవలను హెచ్పీ ఎంటర్ ప్రైజస్ చూసుకుంటుందని, కంప్యూటర్, ప్రింటర్ తదితర ఉత్పత్తులు హెచ్పీ ఐఎన్సీ పేరిట మార్కెటింగ్ కానున్నాయని సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. అక్టోబర్ 31తో ముగిసిన ఈ క్యాలెండర్ ఇయర్ మూడవ త్రైమాసికం ఫలితాలను సంస్థ ప్రకటించగా, గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఆదాయం తగ్గింది. కాగా, 1939లో బిల్ హ్యూలెట్, డేవ్ పాకార్డ్ లు కలసి స్థాపించిన హ్యూలెట్ - పాకార్డ్ సంస్థ సిలికాన్ వ్యాలీకి పునాదిరాయిగా నిలిచింది. ఒక దశలో ప్రపంచ కంప్యూటర్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని, ప్రింటింగ్ సొల్యూషన్స్ అందించడంలో దాదాపు 100 శాతం మార్కెట్ వాటానూ అనుభవించింది. ఆపై కంప్యూటర్ల స్థానంలో స్మార్ట్ ఫోన్లు వస్తుండటంతో, హెచ్పీ ఆదాయం తగ్గుతూ రాగా, అంతే స్థాయిలో లాభాలూ తగ్గాయి. దీంతో మారుతున్న కాలానికి అనుగుణంగా తామూ మారతామని, ప్రజలు కోరుకుంటున్న టెక్ సేవలను అందించే దిశగా సాగుతామని సంస్థ గతంలోనే వెల్లడించింది.