: 132 రైళ్ల టికెట్లు హుష్ కాకి... రైలెక్కకుండానే కనిపిస్తున్న అయ్యప్ప!
ఈ సంక్రాంతి సీజనులో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 132 ప్రత్యేక రైళ్లలో బెర్తులు గంటల వ్యవధిలో మాయమైపోయాయి. ఈ టికెట్లలో అత్యధిక భాగాన్ని అన్ని రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్ద రాత్రి నుంచే మకాం వేసిన ఏజంట్లు, దళారుల అనుచరులు కొల్లగొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ రైళ్లలో రిజర్వేషన్లు ప్రారంభించగా, ప్రస్తుతం వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరిపోయింది. మరోవైపు ఆర్టీసీ తరహాలో రైల్వే శాఖ 'ప్రత్యేకం' పేరిట 30 శాతం అదనపు వసూలుతో రూ. 550 ఉండే స్లీపర్ చార్జీ రూ. 650 దాటింది. ఇక వీటిని ముందే దండుకున్న దళారులు వాటిని రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ సంవత్సరం దాదాపు 4 నుంచి 5 లక్షల మంది వరకూ అయ్యప్ప భక్తులు జంటనగరాల నుంచి శబరిమలకు ప్రయాణమవుతారని అంచనా. దళారుల టికెట్లకూ డిమాండ్ అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేటెక్కువ పెట్టి టికెట్ కొందామని భావించినా కుదరడం లేదని, దీంతో రైలెక్కకుండానే అయ్యప్ప కనిపిస్తున్నాడని భక్తులు వాపోతున్నారు.