: ఇక వ్యాపారం వద్దు, ఎంజాయ్ చేస్తానంటున్న విజయ్ మాల్యా!
ఒకప్పుడు 'కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్'గా గుర్తింపు తెచ్చుకుని, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యూబీ గ్రూప్ పేరిట మద్యం వ్యాపారాల్లో విజేతగా నిలిచి, ఆపై స్వయంకృతాపరాధాలతో అప్పులపాలైన విజయ మాల్యా, తానిక రిటైర్ మెంటు ప్రకటించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. "నాకు మరో నెలలో 60 సంవత్సరాలు నిండుతాయి. ఈ వయసు వారింక పదవీ విరమణ చేసి మిగిలిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అందులో తప్పేమీ లేదు. నేనూ అలాగే చేయాలనుకుంటున్నా" అని బెంగళూరులో జరిగిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాల్యా మీడియాకు వివరించారు. ఫ్రెంచ్ గడ్డం, పోనీటెయిల్ తో వెరైటీగా కనిపించిన ఆయన, ఎప్పుడు రిటైర్ మెంటును ప్రకటించనున్నారన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. సంస్థలో ఆసియా పసిఫిక్, ఆఫ్రికా విభాగాలకు వైస్ చైర్మన్ గా నికోలస్ బోడో బ్లాజాక్వెజ్ నియామకాన్ని మాల్యా సమర్థించారు. ఒకరే జీవితాంతమూ బ్యాటింగ్ చేయలేరని, ఏదో ఓక రోజు ఆటను నిలిపివేయాల్సి వుంటుందని నికోలస్ ఈ సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తారన్న నమ్మకముందని అన్నారు.