: ఎన్నారై కుమార్తె పెళ్లికి 'బాహుబలి' సెట్టింగ్స్... పెళ్లి ఖర్చు జస్ట్ రూ. 55 కోట్లే!
కేరళకు చెందిన రవి పిళ్లై... అరబ్ దేశాల్లో మౌలికాభివృద్ధి, గనులు, విద్య తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఆర్పీ గ్రూప్ అధినేత. ఆయన 26 కంపెనీలు నిర్వహిస్తుండగా, వాటిల్లో 80 వేల మంది పనిచేస్తున్నారు. కేరళ కేంద్రంగా విదేశాల్లో ఉంటున్న వారిలో అత్యధిక సంపన్నుడు కూడా ఆయనే. అటువంటి బిలియనీర్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత ఘనంగా చేయాలనుకున్నాడు. ఇటీవలి సూపర్ హిట్ చిత్రం 'బాహుబలి' తెగ నచ్చేసిందో ఏమో... ఆ చిత్రంలోని సెట్ల తరహాలోనే వివాహ మండపాన్ని తీర్చిదిద్దించాడు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ (బాహుబలికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్)కు పనులప్పగించి తిరువనంతపురంలో ఎనిమిది ఎకరాల్లో రూ. 20 కోట్లతో సెట్టింగులు వేయించాడు. వివాహానికి మొత్తం రూ. 55 కోట్లు ఖర్చవుతుందని భావిస్తుండగా, 42 దేశాల నుంచి వందలాది మంది వీఐపీలు వివాహానికి రానున్నారని తెలుస్తోంది. హీరోయిన్లు శోభన, మంజు వారియర్ తదితరులు అతిథులను అలరించేందుకు నృత్యాలు చేయనున్నారు. వీఐపీలను మండపానికి చేర్చేందుకు ప్రత్యేక విమానాలూ సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇండియాలో అత్యంత ఖర్చుతో జరుగుతున్న వివాహ వేడుక ఇదేనట!